chittore MP Siva Prasad: 'హరి హరీ...' అంటూ చిడతలు వాయించిన చిత్తూరు ఎంపీ
- రోజుకో వేషంతో పార్లమెంట్ కు వస్తున్న శివప్రసాద్
- నేడు నారదుని వేషంలో వచ్చిన శివప్రసాద్
- ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు
నిత్యమూ ఒక్కో వేషధారణతో పార్లమెంట్ కు వచ్చి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం ఎంపీ, నటుడు శివప్రసాద్ నేడు నారదుని వేషంలో వచ్చారు. చేతిలో చిడతలు పట్టుకుని వాటిని వాయిస్తూ, ఆపై మీడియాతో మాట్లాడుతూ, "హరి హరీ... నేనీ మాటలు వినలేకపోతున్నాను. ఈ దృశ్యాలు చూడలేకపోతున్నాను. కాళ్లు పట్టుకోవడాలు ఏంటి? చనిపోయిన పూజ్యనీయులైన తల్లిదండ్రులపై అసభ్య పదజాలాలేంటి? అందుకే ఈ పార్లమెంట్ ఎందుకిలా తయారవుతుందో చూడాలని వచ్చాను.
ఓం నమోనారాయణాయ. వేదంలోనే ఉంది ఓం నమోనారాయణాయ అని. 'నమో' అంటే నరేంద్ర మోదీ. 'నారా' అంటే నారా చంద్రబాబునాయుడు అనుకున్నాను నేను. వాళ్లిద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్ ను గొప్పగా డెవలప్ చేస్తారనుకున్నాను నేను. కానీ, విభజన హామీలు నెరవేర్చకపోతే, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, డెవలప్ మెంట్ కు నిధులివ్వకపోతే, 'నారా' ఎందుకు 'నమో'తో ఉంటాడు? దుష్టుడికి దూరంగానే ఉంటారు. అంతే... నేను చెప్పాను. మోదీగారూ నా మాట వినండని చెప్పాను. ఆయన వినలేదు" అని ఎద్దేవా చేశారు.