Mancherial District: పోలీసులకు కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ తల్లి విగ్రహం!

  • మంచిర్యాల జిల్లా భీమారంలో ఘటన
  • కొత్త స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయింపు
  • అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గుర్తు తెలియని వ్యక్తులు

కొత్తగా పోలీసు స్టేషన్ కట్టాలని ప్రతిపాదిస్తూ కేటాయించిన స్థలంలో రాత్రికి రాత్రే పోచమ్మ తల్లి విగ్రహం వెలిసిన ఘటన మంచిర్యాల జిల్లా భీమారంలో కలకలం రేపుతోంది. ఇటీవల కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తరువాత భీమారం కూడా మండలం కాగా, మోడల్ పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రెవెన్యూ శాఖకు పోలీసు శాఖ విన్నవించగా, పలు మార్లు స్థలం కేటాయించినా, వివిధ కారణాలతో పనులు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.

ఇటీవల జైపూర్ ఏసీపీ సీతారాములు కోరిక మేరకు, భీమారం వచ్చిన మంచిర్యాల ఆర్డీవో, ప్రస్తుతం పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్నే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు పోచమ్మ విగ్రహాన్ని తెచ్చి పెట్టి, చుట్టూ కాషాయం జెండాలు పాతి, దాన్ని ఓ గుడిగా మార్చేశారు. ప్రజలు పెద్దఎత్తున వచ్చి పూజలు ప్రారంభించడంతో, మరోసారి పోలీసు స్టేషన్ భవనం నిర్మాణంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ స్థలంపై కన్నేసిన కొందరు కావాలనే పోచమ్మ విగ్రహం తెచ్చి పెట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News