Chandrababu: నిన్న మూడు పార్టీల నేతలు తప్ప అందరూ వచ్చారు.. ఆవేదన వ్యక్తం చేశారు: చంద్రబాబు
- విభజన హామీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై చర్చించాం
- కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సలహాలు తీసుకున్నాం
- మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నాం
నిన్న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సంఘాల సమావేశానికి మూడు పార్టీల నేతలు తప్ప అందరూ వచ్చారని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... విభజన హామీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై తాము చర్చించామని, కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలో సలహాలు, సూచనలు తీసుకున్నామని అన్నారు.
తాము మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామని, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని చంద్రబాబు అన్నారు. కాగా, ప్రధాని అభ్యర్థిగా ఏపీకి వచ్చిన మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని శాసనసభలో వీడియో రూపంలో ప్రదర్శించి చూపారు. మోదీ ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.