Chandrababu: ప్రత్యేక హోదా అడిగితే హేళనగా మాట్లాడుతున్నారు: చంద్రబాబు

  • పదవుల కోసం మేము లాలూచీ పడలేదు
  • జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే పదేళ్లు పడుతుంది
  • కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హక్కులు సాధించుకుంటాం
  • ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు

తాము ప్రత్యేక హోదా అడిగితే అది స్పెషల్ పర్పస్ వెహికల్ అని కేంద్రమంత్రులు హేళనగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయట్లేదన్న కారణంతోనే కేంద్ర మంత్రి వర్గం నుంచి తమ పార్టీ నేతలు వైదొలిగారని, తాము పదవుల కోసం లాలూచీ పడలేదని అన్నారు. జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే పదేళ్లు పడుతుందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, హక్కులు సాధించుకుంటామని అన్నారు.

హక్కుల కోసం పోరాటంలో రాజీలేదని, వెనక్కుతగ్గబోమని చంద్రబాబు అన్నారు. అప్పట్లో రాజధాని నిర్మాణం, పట్టిసీమలను మెచ్చుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు వాటిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు చాలవా? అని అడుగుతున్నారని, పట్టిసీమలో అవినీతి జరిగిందని అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.

ఓ వైపు కేంద్ర సర్కారుపై పోరాడుతూనే మరో వైపు రాష్ట్రాభివృద్ధి చేసుకుంటామని చంద్రబాబు చెప్పారు. తాము విద్యుత్ రంగంలో రెండోసారి సంస్కరణలు తీసుకొచ్చామని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.   

  • Loading...

More Telugu News