Telangana: కంది రైతుల బకాయిలు తక్షణం చెల్లించండి : మంత్రి హరీశ్ రావు ఆదేశాలు
- వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష
- నాఫెడ్, మార్క్ ఫెడ్, హాకా వంటి సంస్థలు బకాయలు చెల్లించాలి
- రెండు మూడ్రోజుల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి
- తెలంగాణ రైతులపై కేంద్రం శీతకన్ను : హరీశ్ రావు
కంది రైతులకు ఇంకా ఇవ్వవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని నాఫెడ్, మార్క్ ఫెడ్, హాకా సంస్థలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారులతో శాసన మండలి ఆవరణలోని మినిస్టర్స్ చాంబర్స్ లో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.1415.19 కోట్ల విలువ చేసే 2,59,669 మెట్రిక్ టన్నుల కందులను తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని, ఈసారి 2.51 లక్షల హెక్టార్లలో రైతులు కంది పంట వేయడంతో అనూహ్యమైన దిగుబడులు వచ్చాయని అన్నారు.
కంది రైతులకు నాఫెడ్ నుంచి ఇంకా రూ.183.86 కోట్లు, మార్క్ ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ. 52.46 కోట్లు రావాల్సి ఉందని, రెండు మూడు రోజుల్లో ఈ బకాయిలు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు. ఇప్పటి వరకు కంది రైతులకు మొత్తం రూ. 1178.87 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర నష్టం
కందుల సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. కందుల కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, దీనిపై రాసిన లేఖలపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో కందిరైతులను ఆదుకోవాలంటూ స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ను తెలంగాణ మార్కెటింగ్ పలు మార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు.
కాగా శనగల కొనుగోళ్ళు, చెల్లింపులను కూడా హరీశ్ రావు సమీక్షించారు. 50,000 మెట్రిక్ టన్నుల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నుల శెనగలను నాఫెడ్ కొనుగోలు చేసిందని, ఇందుకు గాను రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు తక్షణ విడుదల చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.