new organ: మన శరీరంలో మరో కొత్త అవయవం.. ఇంటర్ స్టిటియమ్
- గుర్తించిన న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
- శరీరమంతా విస్తరించిన అవయవ వ్యవస్థ
- ప్రొటీన్లు, ఇతర రసాయనాల సరఫరాకు తోడ్పడుతుందని గుర్తింపు
మన శరీరంలో కళ్లు, ముక్కు, నోరు, గుండె, కాలేయం, కిడ్నీలు.. ఇలా ఎన్నో అవయవాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇప్పటివరకు మనం గుర్తించని ఓ అవయవ వ్యవస్థను అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అవయవం పేరు.. ఇంటర్ స్టిటియమ్!
కొత్తగా గుర్తించిన ఈ అవయవం ఎక్కడో ఓ మూలన ఉండేదికాదు.. శరీరమంతటా విస్తరించి ఉండేది కావడం గమనార్హం. ఇది శరీర కణజాలాల మధ్య వివిధ రకాలైన ద్రవ పదార్థాలతో నిండి ఉండి, పూర్తిగా అనుసంధానమై ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలో చర్మం కింద, జీర్ణవ్యవస్థలో, ఊపిరితిత్తులు, మూత్రపిండ వ్యవస్థలలో, కండరాల చుట్టూరా ఈ ఇంటర్ స్టిటియమ్ అవయవ వ్యవస్థ ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్యాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ థైస్ వెల్లడించారు.
కణజాలాల మధ్య హైవేలుగా..
సాధారణంగా కణజాలాల మధ్య ఉండే ఖాళీల్లో కొల్లాజెన్ ప్లాస్మా స్థితి (అంటే ద్రవ స్థితి, ఘన స్థితులకు మధ్యలో ఉండే స్థితి)లో ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భావించేవారు. కానీ ఆ ఖాళీలు ప్లాస్మా వంటి స్థితి కాకుండా పూర్తిగా ద్రవాలు ప్రవహించే హైవేల వంటి నిర్మాణాలని తాజాగా గుర్తించారు. శరీరంలో కీలకమైన పలు రకాల ప్రొటీన్లు, ఇతర రసాయన పదార్థాలు ఈ ఇంటర్ స్టిటియమ్ ద్వారా ప్రవహిస్తున్నాయని నిర్ధారించారు.
శరీరంలో ఈ కొత్త వ్యవస్థను గుర్తించిన నేపథ్యంలో.. శరీరంలో పలు రకాల సమస్యలు, వ్యాధులకు సంబంధించి సరికొత్త పరిశోధనలు జరిగే అవకాశముందని డాక్టర్ నీల్ థైస్ చెప్పారు. ముఖ్యంగా శరీరంలో కేన్సర్ ఒక చోటి నుంచి మరో చోటికి విస్తరించే అంశానికి సంబంధించి కచ్చితమైన వాస్తవాలు వెలుగు చూసే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా మనం వినియోగించే ఔషధాల పనితీరు కూడా ఈ వ్యవస్థ వల్ల ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు. అయితే తాము గుర్తించిన కొత్త వ్యవస్థను ఇంకా అధికారికంగా నిర్ధారించలేదని చెప్పారు.