adhar: సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం గడువు మరో 3 నెలలు పొడిగింపు
- ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగింపు
- ఈ నెల 31తో ముగియనున్న గడువు నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపు ప్రకటన
- ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం నుంచి సబ్సిడీ ప్రయోజనాలు పొందుతోన్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులు ఈ నెల 31లోపు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని గతంలో ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించారు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన గడువు (మార్చి 31)ని మార్చకూడదని మొదట భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై చర్చించి ఆధార్ అనుసంధానం చేసుకోని లబ్దిదారులకు మరోసారి వెసులుబాటు కల్పించింది.
ఈ ఏడాది జూన్ 30 వరకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన వారికి కూడా నిన్న సీబీడీటీ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించినట్లు పేర్కొంది.