Roja: తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. ప్రయాణికుల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా!
- శంషాబాద్లో ల్యాండ్ అవుతుండగా పేలిన విమానం టైరు
- విమానంలో రోజా సహా 70 మంది ప్రయాణికులు
- మంటలు అంటుకోవడంతో భయాందోళనలు
- పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండవుతున్న సమయంలో టైరు పేలిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వస్తున్న ఈ విమానంలో రోజా సహా 70 మంది ఉన్నారు. టైరు పేలిపోవడంతో ఒక్కసారిగా నిప్పు రవ్వలు లేచి విమానానికి అంటుకున్నాయి. రన్వే వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు.
విమానం కుదుపులకు గురవడం, మంటలు అంటుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక లోపలున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఆర్పిన తర్వాత కూడా చాలా సేపటి వరకు విమానం తలుపులు తెరవలేదు. విమానం దగ్గరికి ఎవరినీ వెళ్లనీయలేదు. నిజానికి ఈ విమానం రాత్రి 9:40 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా 10:00 గంటలకు ల్యాండైంది. ప్రమాదానికి గురైన విమానం చాలాసేపటి వరకు రన్వే పైనే ఉండడంతో ఆ సమయంలో ల్యాండ్ కావాల్సిన బెంగళూరు నుంచి వచ్చిన స్పైస్ జెట్ విమానం, ముంబై నుంచి వచ్చిన ఇండిగో విమానాలను దారి మళ్లించారు.