vvs laxman: వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన 'సిద్ధప్ప' స్పూర్తిమంతమైన కథ!
- నిరక్షరాస్యుడైన కర్ణాటక రైతు కథను సోషల్ మీడియాలో పంచుకున్న లక్ష్మణ్
- రూ 5000తో విద్యుత్ తయారు చేశాడని వివరణ
- కథకు నెటిజన్ల విశేష స్పందన
టీమిండియా మాజీ దిగ్గజం, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియాలో స్పూర్తిమంతమైన కథలను పంచుకుంటుంటాడు. తాజాగా ట్విట్టర్ లో లక్ష్మణ్ పంచుకున్న కథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దాని వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన నిరక్షరాస్యుడైన రైతు సిద్ధప్ప ఇంటికి సమీపంలో ఒక కాలువ ఉంది. ఆ కాలువలో మూడు నెలలపాటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా రైతులు ఆ మూడు నెలల కాలంలో పొలానికి నీరుపెట్టడం, అధిక దిగుబడి సాధించడం గురించే ఆలోచిస్తుంటారు. కానీ సిద్ధప్ప ఆ రెండింటితో పాటు, విద్యుత్ తయారు చేయొచ్చు కదా అన్న కోణంలో ఆలోచించాడు.
సొంతంగా కేవలం 5,000 రూపాయలతో వాటర్ మిల్ తయారు చేశాడు. దీని సాయంతో మూడు నెలలపాటు ఇంటికి 150 కిలోవాట్ల విద్యుత్ తయారు చేసుకుంటున్నాడు. ఇది అతని ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చుతోంది. ఇప్పుడీ యంత్రం ద్వారా తన ఇంటికే కాకుండా ఊరి మొత్తం విద్యుత్ అవసరాలు తీర్చాలని భావిస్తున్నాడు. దీంతో ఆ దిశగా పనులు ప్రారంభించాడు. నిరక్షరాస్యుడైన సిద్ధప్ప తనకు అందుబాటులో ఉన్న వనరులతో మార్పుకోసం ప్రయత్నించడం ఎంతైనా ముదావహం.. అంటూ లక్ష్మణ్ పేర్కొన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు మెంటార్ అయిన లక్ష్మణ్ జట్టులో ఉన్న వనరులను వినియోగించుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని చెబుతున్న ఈ కథనం నెటిజన్లలో ఆసక్తిని రేపింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.