NTR: ఉపరాష్ట్రపతి ఇటువంటి కార్యక్రమాలకు రాకూడదు... కానీ నేను ఎందుకు వచ్చానంటే..: వెంకయ్యనాయుడు
- సినిమాల ప్రారంభానికి ఉపరాష్ట్రపతులు రారు
- ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమే ఇక్కడికి రప్పించింది
- వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు
సినిమాల ప్రారంభోత్సవాలకు సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులూ హాజరు కాబోరని, అయినా తాను బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కు వచ్చానని, ఎన్టీఆర్ పై తనకున్న అభిమానమే తనను ఇక్కడికి రప్పించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం 'ఎన్టీఆర్' చిత్రానికి క్లాప్ కొట్టిన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ చరిత్రను సృష్టించి, దాన్ని తిరగరాసిన వ్యక్తని, అటువంటి వ్యక్తి జీవితగాధను, ఆయన కుమారుడే తెరకెక్కించేందుకు ముందుకు రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
నేడు తానెంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నానని, ఇక్కడి నుంచి పుణె వెళ్లి, తిరిగి హైదరాబాద్ కు రావాల్సి వుందని చెప్పిన ఆయన, ఇక్కడకు రావడం తన మనసుకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. నటనలో, రాజకీయంలో రాణించిన రామారావు, నటనలో, దరహాసంలో, దర్పంలో, ఠీవీలో తనకెంతో నచ్చుతారని, ఇప్పటికీ, రాముడు, కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తారని అన్నారు. మనమంతా తెలుగులో మాట్లాడి, తెలుగును ప్రోత్సహించడం ద్వారానే రామారావుకు నిజమైన నివాళిని తెలిపిన వారమవుతామని వెంకయ్యనాయుడు తెలిపారు.