West Bengal: పశ్చిమ బెంగాల్లో సద్దుమణగని ‘శ్రీరామనవమి’ అల్లర్లు... 60 మంది అరెస్ట్... ఇంటర్నెట్ సేవలు బంద్
- ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు
- పారా మిలటరీ బలగాలు అక్కర్లేదన్న రాష్ట్ర ప్రభుత్వం
- పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటన
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు అల్లర్లకు దారితీయగా, అవింకా సద్దుమణగలేదు. రాణీగంజ్, అర్సనాల్ లో అల్లరి మూకలు హింసాత్మక చర్యలకు దిగాయి. దీంతో 60 మందిని అరెస్ట్ చేసినట్టు దుర్గాపూర్ పోలీసు కమిషనర్ ఎల్ఎన్ మీనా మీడియాకు వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పారా మిలటరీ దళాలను పంపిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే, కేంద్రం ఆఫర్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తమ పోలీసులు సమర్థులేనని, పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొంది. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తలెత్తిన ఘర్షణలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.