David Warner: డేవిడ్ వార్నర్ స్థానంలో కుశాల్ పెరీరా....!
- కుశాల్ పెరీరాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం....!
- హైదరాబాద్ జట్టు కెప్టెన్ రేసులో ధావన్, కేన్ విలియమ్సన్
- ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ షురూ
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురై చివరకు ఐపీఎల్ టోర్నీలోనూ ఆడే అవకాశాన్ని కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాని హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ కెప్టెన్సీ పదవి నుంచి వార్నర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం నేపథ్యంలో అసలు ఈ ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం అతనికి లేకుండా పోయింది. అతని స్థానంలో గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన కుశాల్ పెరీరాను తీసుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలిసింది.
అతనితో ఇప్పటికే ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఐపీఎల్ నిర్వాహకుల నుంచి గానీ లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు నిషేధానికి గురైన మరో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ అనుమతి పొందింది. ఆ జట్టు పగ్గాలను అజింక్యా రహానెకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కి కెప్టెన్ రేసులో శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.