Telangana: ‘సాక్షర భారత్’ ను కొనసాగించమని కేంద్రాన్ని కోరాను : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం
- ‘సాక్షర భారత్’పై కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం
- ఆ నిర్ణయం రాగానే అక్షరాస్యత కార్యాచరణ అమలు చేస్తాం
- తెలంగాణ శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
రాబోయే ఏడాదిలో కూడా కేంద్ర పథకం సాక్షర భారత్ ను కొనసాగించమని ప్రభుత్వాన్ని కోరానని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సాక్షర భారత్, రాష్ట్రంలో అక్షరాస్యత శాతంపై మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, సభ్యుడు పూలరవీందర్ ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా కడియం సమాధానమిస్తూ, తెలంగాణలో అక్షరాస్యత శాతం పెంచేందుకు రానున్న పదిహేను రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అక్షరాస్యతలో 2011 లెక్కల ప్రకారం దేశ సగటు 72.98 శాతం ఉండగా, రాష్ట్ర సగటు 66.54 శాతం ఉందని, అయితే తెలంగాణలో 7 నుంచి 14 ఏళ్ల లోపు వయస్సున్న వారిలో అక్షరాస్యత శాతం తెలంగాణలో 90.56 శాతం ఉండగా, దేశ సగటు 87.92 శాతం ఉందని అన్నారు. అదేవిధంగా 15-22 ఏళ్లలోపు వారిలో తెలంగాణ అక్షరాస్యత శాతం 96.87 శాతం ఉండగా, దేశ సగటు 86.14 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ రకంగా తెలంగాణ అక్షరాస్యత 7-22 ఏళ్లలోపు దేశ సగటు కంటే మనదే ఎక్కువ ఉందన్నారు. ఇక అక్షరాస్యత పెంచే దిశలో 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
రాబోయే ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ సాక్షర భారత్ పథకంపై పున: నిర్ణయం తీసుకోనుందని, ఈ పథకాన్ని కొనసాగిస్తుందో, లేదో ఇంకా ప్రకటించాల్సి ఉందని చెప్పారు. ఈ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తాను కేంద్రానికి లేఖ రాశానన్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసి స్వయంగా ఈ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పానని అన్నారు. అయితే కేంద్రం దీనిపై విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామన్నారు.
కేంద్రం తన పథకాన్ని కొనసాగించినా, కొనసాగించకపోయినా....రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్షరాస్యత పెంచే కార్యక్రమాన్ని వచ్చే 15 రోజుల్లో అమలు చేయనున్నట్టు కడియం తెలిపారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చోట అక్షరాస్యత బాగుందని, అదేవిధంగా కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు అక్షరాస్యత శాతం పెంచేందుకు పని చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహిస్తామని, ప్రజా ప్రతినిధులు కూడా దీనిని బాధ్యతగా తీసుకోవాలని కడియం సూచించారు.