isro: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-6ఏ
- అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6ఏ
- శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగం
- ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోన్న ఇస్రో ఛైర్మన్ కే శివన్
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6ఏ ను ప్రయోగించింది. ఈ రోజు సరిగ్గా 4.56 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. నిప్పులు చిమ్ముతూ జీశాట్-6ఏ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళుతోంది. ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్-6ఏ రెండవది. 2015 ఆగష్టులో ఇస్రో జీశాట్-6ను ప్రయోగించిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రయోగిస్తోన్న జీశాట్-6ఏ ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చుతుంది. ఇందుకోసం ఇస్రోకి రూ. 270 కోట్లు ఖర్చు అయింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైంది. మిలటరీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మరో 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-6ఏ ఉపగ్రహం చేరుతుంది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.