Amit sha: దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోదీకే మీ ఓటు వేయండి.. షాకిచ్చిన అమిత్ షా అనువాదకుడు
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభాసుపాలు
- అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అనువాదకుడు
- పేదలకు మోదీ చేసిందేమీ లేదంటూ ప్రసంగం
- దేశాన్ని మోదీ నాశనం చేస్తారన్న ఇంటర్ ప్రెటర్
కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న సొంత పార్టీ సీఎం అభ్యర్థి యాడ్యురప్పను దేశంలోనే అత్యంత అవినీతిపరుడని పేర్కొన్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా అనువాదకుడు (ఇంటర్ ప్రెటర్) ఘోర తప్పిదం చేశాడు.
దేవనగిరి జిల్లా చల్లకెరెలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనువదిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు. దేశాన్నిఆయన నాశనం చేయడం ఖాయం.. దయచేసి ఆయనకు ఓటు వేయండి’’ అని పేర్కొనడంతో షా సహా బీజేపీ నేతలు, ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
నిజానికి షా మాట్లాడుతూ.. ‘‘సిద్ధ రామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మోదీపై మీకున్న అభిమానాన్ని యాడ్యురప్పకు ఓటేయడం ద్వారా చూపించండి. కర్ణాటకను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మారుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అనువాదకుడి పొరపాటుతో ప్రజలు విస్తుపోయారు.
ఇటీవల పార్టీ సీఎం అభ్యర్థి యాడ్యురప్పను అవినీతిపరుడుగా పేర్కొని నాలుక్కరుచుకున్న షా తాజా ఘటనతో మరోమారు షాక్ తిన్నారు. ప్రసంగాలతో రెండుసార్లు దొరికిపోయిన బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. షా ప్రసంగాన్ని అస్త్రంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తోంది. షా ఇన్నాళ్లకు నిజం చెప్పారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.