Karnataka Bank: ఇదో టైపు మోసం.. ఏకంగా నకిలీ బ్యాంకునే పెట్టి ప్రజలకు బురిడీ!

  • నకిలీ బ్యాంకు పెట్టిన ఘరానా మోసగాడు
  • పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు తెరిపించిన ఘనుడు
  • లావాదేవీలపై అనుమానంతో ఫిర్యాదు చేసిన స్థానికుడు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

భారతీయ బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేస్తే.. ఇతడు ఏకంగా నకిలీ బ్యాంకునే పెట్టేశాడు. బ్యాంకు లావాదేవీలపై ఓ ఖాతాదారుడికి అనుమానం రావడంతో చివరికి ఈ విషయం వెలుగులోకి తెచ్చి భారీ కుంభకోణం నుంచి ప్రజలను కాపాడాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లా ఫెఫ్నా ప్రాంతంలో అఫక్ అహ్మద్ అనే వ్యక్తి  నెల రోజుల క్రితం కర్ణాటక బ్యాంకు శాఖను ఏర్పాటు చేసి ప్రజలతో పొదుపు ఖాతాలు తెరిపించాడు. ఫిక్సిడ్ డిపాజిట్లు చేయించాడు. బ్యాంకు వ్యవహారంపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి బ్యాంకు ఫొటోలను తీసి ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటక శాఖ అధికారులకు వాట్సాప్ చేశాడు. వాటిని చూసిన అధికారులు నకిలీ బ్యాంక్ అని నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ముంబైకి చెందినవాడిగా గుర్తించారు. తన పేరును వినోద్ కుమార్ కంబాలీగా మార్చుకుని, అదే పేరుతో ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను సంపాదించాడు. అనంతరం స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో బ్యాంకు శాఖ ప్రారంభించాడు. పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో మొత్తం రూ.1.37 లక్షలు వసూలు చేశాడు. పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుంభకోణంతో వారికి సంబంధం లేదని తేలడంతో వదిలిపెట్టారు.

  • Loading...

More Telugu News