russia: అమెరికా దౌత్యాధికారులను వెలేసిన రష్యా... మండిపడ్డ అగ్రరాజ్యం
- రెండు దేశాల మధ్య సంబంధాలకు మరింత విఘాతం
- రష్యా స్పందన అర్థవంతంగా లేదన్న అమెరికా
- అమెరికా దౌత్య సిబ్బంది వారంలోగా వెళ్లిపోవాలని రష్యా ఆదేశం
అమెరికాపై రష్యా ప్రతీకార చర్యకు దిగింది. అమెరికాకు చెందిన 60 మంది దౌత్య సిబ్బందిని వారంలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, సెయింట్ పీటర్స్ బర్గ్ ఆఫీసును 48 గంటల్లోగా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం అమెరికా కూడా తమ దేశం నుంచి వెనక్కి వెళ్లిపోవాలని 60 మంది రష్యా దౌత్య సిబ్బందిని ఆదేశించిన విషయం గమనార్హం. దీంతో అమెరికా చర్యకు రష్యా ప్రతిచర్య తీసుకుంది. దీనివల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత విఘాతం కలుగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సరా సాండర్స్ అన్నారు.
కాగా, ఆమధ్య బ్రిటన్ లో ఓ వ్యక్తి, అతని కుమార్తెపై దాడి జరిగింది. అది రష్యా గూఢచారుల పనిగా బ్రిటన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా నాటో కూటమికి చెందిన దేశాలు రష్యాపై భగ్గుమన్నాయి. ఆ క్రమంలో అమెరికా సహా నాటో దేశాలు రష్యా దౌత్య సిబ్బందిని తమ దేశం నుంచి వెలేశాయి. దీంతో రష్యా ఇప్పుడు అదే పని చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే, రష్యా స్పందన న్యాయబద్ధంగా లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హెదర్ నార్ట్ అన్నారు. బ్రిటన్ లో బ్రిటిష్ పౌరుడు, అతని కుమార్తెపై జరిగిన దాడి ఆధారంగానే తాము రష్యా దౌత్య సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.