sidda ramayya: అమిత్ షాది హిందూ మతమా? జైన మతమా?...దేశ ప్రజలకు స్పష్టం చేయాలి: సిద్ధరామయ్య
- అమిత్ షా మమ్మల్ని చూసి ఆందోళన చెందుతున్నారు
- మేమెక్కడ పర్యటిస్తే అక్కడే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు
- గతేడు ఉపఎన్నికల ఫలితాలు ఏంటో అమిత్ షా తెలుసుకోవాలి
హిందూ మతాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ తమపై నిందలు మోపే బీజేపీ అధినేత అమిత్ షా ఏ మతానికి చెందినవారో దేశ ప్రజలకు వివరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. మైసూరులో ఆయన మాట్లాడుతూ, అమిత్ షా హిందూ మతానికి చెందినవారా? లేక జైన మతానికి చెదినవారా? అని ప్రశ్నించారు. అమిత్ షా తమను చూసి ఆందోళన చెందుతున్నారని, అందుకే తాము ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే ఆ తరువాత అక్కడే ఆయన పర్యటిస్తున్నారని విమర్శించారు.
గతేడు జరిగిన నంజనగూడు, గుండ్లుపేట నియోజకవర్గాల ఉప ఎన్నికల సందర్భంగా యడ్యూరప్ప సహా బీజేపీ నేతలు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఏమొచ్చిందో తెలుసుకోవాలని ఆయన సూచించారు. అవే ఫలితాలు మే 12 ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం గురించి తెలియకుండా కుమారస్వామి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి తాను ఏడు సార్లు పోటీ చేస్తే, ఐదుసార్లు గెలిచానని గుర్తు చేసిన ఆయన, ఈ సారి కూడా తాను అక్కడి నుంచే పోటీలో ఉంటానని తెలిపారు.