USA: అమెరికా వీసా కావాలంటే ఇకపై ఫోన్ నంబర్లు, ఫేస్ బుక్, ఈమెయిల్ ఐడీ అన్నీ ఇవ్వాల్సిందే!
- గడిచిన ఐదేళ్లలో వాడిన వాటి గురించి చెప్పాలి
- వీసా దరఖాస్తుదారులకు ఎన్నో ప్రశ్నలతో కూడిన జాబితా
- వాటన్నింటికీ విధిగా సమాధానాలు రాయాల్సిందే
వీసా నిబంధనలను అమెరికా కట్టుదిట్టం చేసింది. దరఖాస్తుదారులు ఇక నుంచి తాము గత ఐదేళ్లుగా వాడిన ఫోన్ నంబర్లు గురించి తెలియజేయాలి. అలాగే వారికున్న అన్ని ఈ మెయిల్ ఐడీలు, సోషల్ మీడియా ఖాతాల సమాచారం కూడా చెప్పాలి. తమ దేశానికి ఏ రూపంలోనూ ముప్పు రాకూడదని అమెరికా ఇలా నిబంధనలు మార్చింది. అమెరికాకు రాావాలనుకునే వారు ఎవరైనా సరే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజిస్ట్రార్ స్పష్టం చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రభావం 7,10,000 ఇమిగ్రెంట్, 14 లక్షల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులపై ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ అంచనా వేస్తోంది. ఇక గతంలో సదరు వ్యక్తిని ఏ దేశమైనా వెనక్కి పంపించేయడం జరిగిందా? కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారా? వంటి ప్రశ్నలను కూడా వీసా దరఖాస్తుదారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.