Kambhampati Rammohan Rao: కేంద్ర ప్రభుత్వానికి యూసీలు పంపితే, పంపలేదని ప్రచారం చేస్తున్నారు: కంభంపాటి రామ్మోహన్
- ఏపీ ప్రజలు చివరి బడ్జెట్ వరకు వేచి చూశారు
- చివరి బడ్జెట్లోనూ అన్యాయం జరిగింది
- న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని 19 అంశాలు నెరవేర్చాల్సిందేనని టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ వరకు వేచి చూశారని, ఆ బడ్జెట్లోనూ అన్యాయం జరిగిందని, న్యాయం జరిగేవరకు తాము పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు.
ఓ వైపు ఏపీ ప్రయోజనాలపై పోరాడుతున్నామంటూ చెప్పుకుంటోన్న ప్రతిపక్ష పార్టీల నేతలు మరోవైపు ప్రజలను రెచ్చగొడుతున్నారని కంభంపాటి రామ్మోహన్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు ఏపీ ప్రయోజనాల కంటే, సొంత ప్రయోజనాలే ముఖ్యమని, తమ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి యూసీలు పంపితే, పంపలేదని ప్రచారం చేస్తున్నాయని అన్నారు.