fake news: వెబ్సైట్లో అసత్య వార్తలు రాసినందుకు ఎడిటర్ అరెస్ట్.. 14 రోజుల పోలీసు కస్టడీ
- ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా వార్తలు
- కర్ణాటకలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదంటూ న్యూస్
- పోస్ట్‌కార్డ్ వెబ్సైట్ నిర్వాహకుడిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్‌కార్డ్ వెబ్సైట్ నిర్వాహకుడు మహేశ్ విక్రమ్ హెగ్డే కథనాలు రాయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ జైన గురువుపై ముస్లిం యువకుడు దాడి చేసినట్లు ఇటీవల ఆయన రాసిన కథనాలు అలజడి రేపాయి. జైనమత గురువు ఉపాధ్యాయ మయాంక్ సాగర్ జీ మహారాజ్ హాసన్.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతోన్న సమయంలో ఓ ముస్లిం యువకుడు మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ జైన గురువును ఢీకొట్టాడని, అనంతరం దాడికి పాల్పడ్డాడని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు పాలనలో తమ రాష్ట్రంలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదని ఆయన వార్తలు రాశాడు.
సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సదరు ఎడిటర్ విక్రమ్ హెగ్డేను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చామని, నిందితుడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారని పోలీసులు తెలిపారు.