Japan: జపాన్ సముద్రంలో పడిపోయిన కెమేరా.. రెండేళ్ల తరువాత దొరికిన వైనం!
- ఫొటోలు తీస్తున్న సమయంలో సముద్రంలో పడిన కెమెరా
- రెండేళ్ల తరువాత బీచ్ ను శుభ్రం చేస్తుండగా దొరికిన వైనం
- ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, 12 గంటల్లో 13,000 షేర్లు
ఏదైనా వస్తువు పొరపాటున పోతే దొరకడం కష్టం. అదే సముద్రంలో పడిపోతే.. దానిపై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలా ఆశలు వదిలేసుకున్న జపాన్ యువతిని తైవాన్ లో దొరికిన కెమేరా ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... జపాన్ కు చెందిన సెరేనా సుబాకిహర అనే యువతి విజ్ఞానయాత్రలో భాగంగా సముద్రయానం చేస్తూ, ఫొటోలు తీస్తున్న సమయంలో పొరపాటున ఆమె కెమెరా సముద్రంలో పడిపోయింది.
తనెంతో ఇష్టపడి తీసిన ఫొటోలతో పాటు కెమెరా పడిపోవడంతో తన విజ్ఞానయాత్రకు సంబంధించిన తీపి జ్ఞాపకాలు పోయాయని బాధపడింది. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయింది. ఇది జరిగిన రెండేళ్ల తరువాత సోషల్ మీడియాలో సముద్రపు ఒడ్డును క్లీన్ చేస్తుండగా దొరికిన పాచిపట్టిన కెమెరాను పరిశీలిస్తున్న తైవాన్ విద్యార్థిని ఫొటో ఆమెను ఆకట్టుకుంది. దానిని పార్క్ లీ అనే ఉపాధ్యాయురాలు పోస్టు చేసింది. విద్యార్థులకు దొరికిన ఆ కెమెరా పని చేస్తోందని, సముద్ర జలాల్లో పడిపోయినా సాధారణంగా పనిచేస్తున్న ఆ కెమెరాను చూసి ఆశ్చర్యపోయామంటూ ఆమె పోస్టులో పేర్కొన్నారు.
ఆ కెమెరా తనదే అని గుర్తించిన సెరేనా, పార్క్ లీని సంప్రదించి, ఆ కెమెరా తనదేనని చెప్పింది. ఆ కెమెరాతో చివరి సారిగా తాను 2015 సెప్టెంబరు 7న జపాన్ లోని ఒకినావా ప్రాంతంలోని ఇషిగాకి ఐలాండ్ ఫొటోను తీసినట్లు వివరించింది. దీంతో ఆ కెమెరా ఆమెదేనని నిర్ధారించిన పార్క్ లీ ఆమెకు దానిని పంపించారు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సెరేనా... ‘ప్రపంచం చాలా విచిత్రమైంది. రెండేళ్ల తర్వాత నా కెమెరాను నాకు అందించింది. అన్నింటికంటే వింత ఏంటంటే అది ఇప్పటికీ బాగా పనిచేస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి, పార్క్ లీ, పాఠశాల విద్యార్థులకు, నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపింది.