Ramdas Athawale: యూపీలో బీజేపీ సీట్లు తగ్గిపోతాయ్.. సొంత మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీకి ముప్పే
- బీజేపీ 30 సీట్లను కోల్పోతుంది
- కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 30 సీట్లు తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడైన అథవాలే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ 25 నుంచి 30 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. యూపీలో 50కి పైగా సీట్లు వస్తాయన్న ఆయన ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 73 సీట్లను గెలుచుకుంది. ప్రధాని మోదీని సవాలు చేసే సత్తా కాంగ్రెస్‌కు కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కు కానీ, ఎస్పీ, బీఎస్పీలకు కానీ లేదని తేల్చి చెప్పారు. అంబేద్కర్ పేరులో రాంజీని చేరుస్తూ యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన అథవాలే, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు, మహా దళితులకు రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడాన్ని స్వాగతించారు.