Supreme Court: ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోతుంటే ఏం చేస్తున్నారు?... తగ్గించరా?: సుప్రీం మండిపాటు

  • ఖైదీల మానవ హక్కుల ఉల్లంఘనపై సుప్రీం సీరియస్
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అక్షింతలు
  • ఖైదీల తగ్గింపుకు రెండు వారాల్లోగా ప్లాన్ రూపొందించాలని ఆదేశం

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఖైదీల మానవ హక్కుల విషయంలో ఇంత అలసత్వమేంటని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సూటిగా ప్రశ్నించింది. జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని రెండు వారాల్లోగా నివేదించకపోతే, కోర్టు ధిక్కార నేరం కింద చర్య తీసుకోవాల్సి ఉంటుందని జైళ్ల డైరెక్టర్ జనరళ్లను హెచ్చరించింది. జైళ్ల నిర్దిష్ట సామర్థ్యానికి మించి 150 శాతం మేర అధికంగా ఖైదీలతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కోర్టు ఈ మేరకు కన్నెర్ర చేయడం గమనార్హం.

కొన్ని సందర్భాల్లో జైళ్లు వాటి సామర్థ్యానికి మించి 609 శాతం అధికంగా ఖైదీలు ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఖైదీల రద్దీని తగ్గించేందుకు ఓ ప్రణాళికను రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం మే 6, 2016 నుంచి అడుగుతూనే ఉన్నా స్పందన మాత్రం శూన్యం. ప్రభుత్వాల అలసత్వాన్ని న్యాయమూర్తులు మదన్ బి.లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది.

"ఇది అత్యంత దురదృష్టకరం. ఖైదీల మానవ హక్కుల విషయంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. అంతేకాక అండర్ ట్రయల్ సమీక్ష కమిటీలు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడంలో వైఫల్యం చెందాయని స్పష్టమయింది" అంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఖైదీల మానవ హక్కులపై ఈ కేసులో సుప్రీంకోర్టుకి న్యాయ సలహాదారు (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న గౌరవ్ అగర్వాల్‌ సంధించిన ప్రశ్నకు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్, అసోం, బీహార్ రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది.

  • Loading...

More Telugu News