cbse paper leak: సీబీఎస్ఈ పరీక్షా పత్రాల లీకేజీపై ఢీల్లీ హైకోర్టుకు పేరెంట్స్ అసోసియేషన్!
- సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటన
- లీకేజీ వ్యవహారంతో నమ్మకం కోల్పోయినట్టు వెల్లడి
- కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్
సీబీఎస్ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. పన్నెండో తరగతి ఎకనమిక్స్ పేపరు, పదో తరగతి మ్యాథ్స్ పేపర్లు లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను ఈ నెల 25న తిరిగి నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పదో తరగతి మ్యాథ్స్ పరీక్షను కూడా తిరిగి నిర్వహించాలా? లేదా? అన్నది తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. అయితే, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.
అసోసియేషన్ ప్రెసిడెంట్, న్యాయవాది కూడా అయిన అశోక్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. పేపర్ల లీకేజీ వ్యవహారం తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదని, తాము సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు. లీకేజీపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరతామన్నారు.