airtel: ఎయిర్ టెల్ కు షాక్... పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఈకేవైసీ పునరుద్ధరణకు యూఐడీఏఐ నిరాకరణ
- ఆర్ బీఐ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు నిషేధం
- ఆడిట్ లో లోపాలను కంపెనీ సవరించింది
- దీంతో మొబైల్ ఈకేవైసీ లైసెన్స్ పొడిగిస్తున్నట్టు ప్రకటన
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆధార్ ఈ కేవైసీ సౌకర్యాన్ని పునరుద్దరించడానికి యూఐడీఏఐ నిరాకరించింది. ఎయిర్ టెల్ మొబైల్ సేవలకు మాత్రం ఈకేవైసీ సేవలు వినియోగించుకునేందుకు ఉన్న తాత్కాలిక అనుమతిని పొడిగిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈకేవైసీతో మొబైల్ చందాదారుల ధ్రువీకరణలు ఇకపైనా పూర్తి చేసేందుకు వీలు కానుంది. మార్చి 31 తర్వాత కొన్ని పరిమితుల మేరకు ఆధార్ ఈ కేవైసీ లైసెన్స్ ను కొనసాగిస్తున్నట్టు యూఐడీఏఐ ప్రకటించింది.
‘‘టెలికం శాఖ, యూఐడీఏఐ కలసి చేసిన ఆడిట్ లో బయటపడిన లోపాలను కంపెనీ సవరించింది. కనుక లైసెన్స్ ను పొడిగిస్తున్నాం’’ అని యూఐడీఏఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంకు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఈకేవైసీపై ఉన్న నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఎయిర్ టెల్ తన చందాదారులకు తెలియకుండానే వారి పేరిట పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఆయా చందాదారుల గ్యాస్ సబ్సిడీలు వచ్చి ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల్లో పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఈకేవైసీని దుర్వినియోగిం చేసిందన్న ఆరోపణలపై పేమెంట్స్ బ్యాంకుకు ఆ సేవలను యూఐడీఏఐ నిలిపివేసిన విషయం తెలిసిందే.