China: బరితెగించిన చైనా... అరుణాచల్ ప్రదేశ్ లో భారీ అక్రమ కట్టడాలు
- బరితెగించిన డ్రాగన్ కంట్రీ
- సరిహద్దుల వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లో భారీ కట్టడాలు
- ఆంజా జిల్లాలో టెలీకమ్యూనికేషన్ టవర్ తో పాటు అబ్జర్వేషన్ పోస్ట్ ను ఏర్పాటు చేసిన చైనా
డ్రాగన్ దేశం చైనా బరితెగించి, వక్రబుద్ధితో అరుణాచల్ ప్రదేశ్ లో అక్రమంగా భారీ నిర్మాణాలను చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని ఆంజా జిల్లాలో ఉన్న కిబుతూ పట్టణానికి మరోవైపున ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసింది. ఆ క్యాంపు దగ్గర అనేక ఇండ్లను కూడా నిర్మించడం విశేషం. ఇండియన్ ఆర్మీతో పాటు చైనా ఆర్మీకి కిబుతూ ప్రాంతం ఒక మీటింగ్ పాయింట్. అరుణాచల్ ప్రదేశ్ లోకి భారత్ విదేశీ పర్యాటకులకు అనుమతులిస్తున్న నేపథ్యంలో... చైనా అక్రమ నిర్మాణాలు ఆందోళన రేపుతున్నాయి.
ఆంజా జిల్లాలో చైనా కొత్తగా టెలీకమ్యూనికేషన్ టవర్ తో పాటు అబ్జర్వేషన్ పోస్ట్ ను కూడా నిర్మించడం, దాని కోసం నిఘా పరికరాలను కూడా ఏర్పాటు చేయడం ఆందోళనకరం. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. డోక్లాం సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద చైనా హెలిప్యాడ్లను, సెంట్రీ పోస్టులను నిర్మిస్తున్నదని ఇటీవల పార్లమెంట్ లో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.