cpi: రెండు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి జనసేన కూటమి!
- సీపీఐ, సీపీఎం, జనసేనలతో కొత్త కూటమి
- సీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడతామన్న రామకృష్ణ
- తొలి సభను అనంతపురంలో ఏర్పాటు చేస్తాం
ఏపీలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడబోతోంది. జనసేన, సీపీఐ, సీపీఎంలతో కలసి సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు వివరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై తమ కూటమి పోరాటం చేస్తుందని చెప్పారు. తమ కూటమికి సంబంధించిన తొలి సభను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 5న కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే... బ్లాక్ డే పాటిస్తామని చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తమతో కలసి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు.