Indore: ఇండోర్‌లో కుప్పకూలిన నాలుగు అంతస్తుల హోటల్.. పదిమంది దుర్మరణం
- శిథిలాల కింద మరో 24 మంది
- ఏడుగురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది
- వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఇండోర్‌లో నాలుగంతస్తుల హోటల్ కూలిన ఘటనలో పదిమంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే సర్వాతే బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
50 ఏళ్ల నాటిదైన ఈ హోటల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు వినిపించాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఇండోర్ డీఐజీ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారులు, మేయర్ మాలిని గౌర్, బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్, డివిజినల్ కమిషనర్ సంజయ్ దూబె, కలెక్టర్ నిషాంత్ వర్వాడే, డీఐజీ, మునిసిపల్ కమిషనర్ మనీష్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
శిథిలాల్లో ఇంకా 24 మందికిపైగా చిక్కుకుని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌ను కొన్ని భారీ వాహనాలు ఢీకొనడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.