CBSE: సీబీఎస్ఈ పేపర్ లీక్: ప్రిన్సిపాల్, ఆరుగురు టీచర్లను ప్రశ్నిస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
- పేపర్ లీక్ కేసులో వేగం పెంచిన పోలీసులు
- ఇప్పటి వరకు 53 మందిపై ప్రశ్నల వర్షం
- మరింతమందిపై నిఘా
దేశాన్ని కుదిపేసిన సీబీఎస్ఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఢిల్లీ అవుటర్‌లోని మూడు పబ్లిక్ స్కూళ్లకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు, ఓ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం లీక్ కావడం వెనక వీరి హస్తం ఉందన్న అనుమానంతో ప్రశ్నిస్తున్నారు.
బవానా స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లను శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రశ్నించారు. మార్చి 26న ఉదయం 8 గంటలకు, అంటే పరీక్ష ప్రారంభం కావడానికి 75 నిమిషాల ముందు కొందరు విద్యార్థుల సమక్షంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్‌ను ఓపెన్ చేసినట్టు వారు చెప్పారు. అలాగే రెండు పేపర్ సెట్లకు కస్టోడియన్‌గా వ్యవహరించిన సోనెపట్‌కు చెందిన సీబీఎస్ఈ ఉద్యోగిపైనా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఈ ప్రాంతంలో లీకైన పేపర్ కోడ్.. ఇతడి అధీనంలో ఉన్న పేపర్ సెట్లలోని కోడ్‌తో సరిపోలడంపై పోలీసులు అతడిపై నిఘా పెట్టారు.
మరోవైపు, పదో తరగతి గణితం పేపర్ లీక్ కాబోతోందని చెబుతూ పేపర్ కాపీని మెయిల్ చేసిన విద్యార్థి వివరాలను సెర్చింజన్ గూగుల్ ఢిల్లీ పోలీసులకు అందించింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వెళ్లిందో ఐపీ అడ్రస్ కావాలని కోరగా, స్పందించిన గూగుల్ ఈ వివరాలను అందజేసింది.
పేపర్ లీక్ కేసులో శనివారం వరకు పోలీసులు మొత్తం 53 మంది విద్యార్థులను ప్రశ్నించారు. అలాగే కొందరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ సభ్యులుగా ఉన్న మరో ఆరు వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. కాగా, మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలన్న సీబీఎస్ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం కొందరు విద్యార్థులు ప్రీత్ విహార్‌లోని బోర్డు కార్యాలయం బయట ఆందోళన చేపట్టారు.