Vijayanagaram District: విజయనగరం విద్యార్థుల అద్భుతం... రూ. 75 వేలల్లో లీటర్ కు 20 కి.మీ. వెళ్లే కారు సృష్టి!
- ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్న కారు
- ఆరుగురు ప్రయాణించే వీలు
- అల్ట్రాసోనిక్ సెన్సార్ల ఏర్పాటు
- మద్యం తాగితే ముందుకు కదలదు!
విజయనగరం జిల్లా విద్యార్థులు అద్భుతాన్ని చేసి చూపారు. బొబ్బిలి సమీపంలోని కోటమపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు రూ. 75 వేలల్లో ఆరుగురు ప్రయాణించే కారును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి తయారు చేయగా, ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు తలచుకుంటే ఎంతటి అద్భుతాన్నైనా సాధించగలరని నిరూపించారని పలువురు పెద్దలు, రాజకీయ నాయకులు వారిని అభినందిస్తున్నారు. ఈ కారు ఎన్నో ప్రత్యేకతలను కలిగివుండటం గమనార్హం.
గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో లీటరు ఇంధనంతో 20 నుంచి 23 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుందని, కారును తయారు చేసిన విద్యార్థులు వెల్లడించారు. అల్ట్రాసోనిక్ సెన్సార్ల సాయంతో నడిచే కారు, ఎదురుగా మీటరు దూరంలో ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడితే దాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. డ్రైవర్ మద్యం తాగి ఉంటే, కారు ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు సరికదా, దాని యజమాని సెల్ ఫోన్ కు సమాచారం వెళుతుంది. దీన్ని ఎవరైనా దొంగతనం చేస్తే, ఆన్ లైన్ సాయంతో కారు ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపాల్ బీ వెంకటరమణ ఆధ్వర్యంలో దీన్ని రూపొందించినట్టు విద్యార్థులు జీఎల్ కార్తీక్, వి.సురేష్, ఎన్ ఎస్ శ్రీకాంత్, వీ మణికంఠ, బీ హరీష్‌బాబు తెలిపారు.