Tamilnadu: జల్లికట్టు స్ఫూర్తి... మరోసారి మెరీనా బీచ్ వైపు కదులుతున్న తమిళ యువత!
- రెండేళ్ల క్రితం జల్లికట్టు కోసం ఉద్యమించిన యువత
- ఇప్పుడు కావేరీ రివర్ బోర్డు కోసం మరోసారి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్
దాదాపు రెండు సంవత్సరాల క్రితం, తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వేళ, తమిళనాడు యువతీ యువకులు సంఘటితంగా చేసిన ఉద్యమం గుర్తుందా? ప్రసిద్ధ మెరీనా బీచ్ వేదికగా, యువత జరిపిన ఉద్యమానికి ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. ఇప్పుడు తిరిగి అదే తరహా ఉద్యమానికి అక్కడి యువత ముందుకు కదులుతోంది.
కావేరీ నదీ జలాల పంపిణీని పర్యవేక్షించే నిర్వహణా బోర్డును తక్షణం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 5 నుంచి మెరీనా బీచ్ వేదికగా మరోసారి నిరసనలు తెలపాలని డీఎంకే నిర్ణయించడం, అందుకు రాష్ట్రంలోని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు పలకడంతో అందరూ గురువారం నాటికి మెరీనా తీరానికి చేరాలన్న నిశ్చయానికి వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వాట్స్ యాప్ గ్రూపుల్లో మెసేజ్ వైరల్ అవుతుండగా, ప్రతి ఒక్కరూ వస్తామన్న సమాధానాన్నే ఇస్తున్నారు. మరోవైపు ఇంతకాలం కావేరీ రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చిన కేంద్రం, ఇప్పుడు కర్ణాటక ఎన్నికలను సాకుగా చూపుతూ, మరో రెండు నెలల తరువాత బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.