Telugudesam: ఆ మాటలన్న జగన్ సిగ్గుపడాలి: మంత్రి ప్రత్తిపాటి
- ప్రత్యేక హోదా కోరుతూ పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభం
- రాజధాని నిర్మాణం జగన్ కు ఇష్టం లేదు
- మా ఎంపీలను రాజీనామా చేయమని అడిగే అర్హత జగన్ కు లేదు
రాజధాని భూములను ఎడారి భూములన్న జగన్ సిగ్గుపడాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం జగన్ కు ఇష్టం లేదని, ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాకుండా పారిపోయిన వైసీపీకి తమ ఎంపీలను రాజీనామా చేయాలని అడిగే అర్హత లేదని అన్నారు.
ఏపీ కోసం జగన్, పవన్ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలి : ఎంపీ కేశినేని
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా పోస్ట్ కార్డ్ విడుదల చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినట్టే నేటి బీజేపీ సర్కార్ కూడా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయని అన్నారు.
కేవలం రూ.1500 కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఏపీ కోసం జగన్, పవన్ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలని కోరారు. జైలు పక్షులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటే ప్రజలు నమ్మరంటూ ఈ సందర్భంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసుల్లో ఇరుక్కుపోయిన వైసీపీ రాజీపడిందని, డబ్బు కోసం జనసేన పార్టీ అమ్ముడుపోయిందని ఆరోపించారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం చర్చకు వస్తుందనే ఉద్దేశంతోనే అవిశ్వాసతీర్మానంపై చర్చకు మోదీ సర్కార్ భయపడుతోందని అన్నారు.
ఢిల్లీని ఢీకొంటాం.. 2019లోనూ ఏపీలో అధికారం మాదే : ఎమ్మెల్యే బోండా ఉమ
టీడీపీకి చెందిన మరో నేత బోండా ఉమ మాట్లాడుతూ, ఏపీ బీజేపీ నేతలు ప్రజల పక్షమో, మోదీ పక్షమో తేల్చుకోవాలని అన్నారు. ఢిల్లీని ఢీకొంటామని, 2019లోనూ ఏపీలో అధికారంతో పాటు కేంద్రంలోనూ కీలకపాత్ర పోషిస్తామని బోండా ఉమ తెలిపారు. అనంతరం, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ, గోద్రా అల్లర్ల సమయంలో చంద్రబాబు ముస్లింల పక్షాన నిలబడ్డారని, అందుకే, ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా మోదీ కక్ష గట్టారని మండిపడ్డారు.