Chandrababu: ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు తిప్పడానికి చక్రం లేదు!: జీవీఎల్ నరసింహారావు
- అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధం
- అన్నాడీఎంకేతో చర్చించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలి
- కేంద్ర స్థాయిలో చంద్రబాబుకు పార్టీల మద్దతు లేదు
- ఏపీకి ఇచ్చిన నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ జరగాలి
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు తిప్పడానికి చక్రం లేదని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతోంది కాబట్టి, అన్నాడీఎంకేతో చర్చించే బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న చంద్రబాబు, కేసీఆర్ లు పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడలేరా? అని ప్రశ్నించారు.
కేంద్ర స్థాయిలో చంద్రబాబుకు పార్టీల మద్దతు లేదని అన్నారు. తొలుత పార్లమెంట్ లో ఆందోళన మొదలుపెట్టి ఇతర పార్టీల ఆందోళనలకు టీడీపీ మార్గదర్శకమైందని అన్నారు. ఏపీకి ఇచ్చిన కేంద్ర నిధుల వినియోగంపై క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ జరగాలని, ఎందుకోసం ఖర్చు పెట్టారో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీ ఏ విధంగా ఖర్చు చేసిందో, క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రజలకు తెలియజేస్తామని నరసింహారావు అన్నారు.