China: హమ్మయ్య! ప్రపంచాన్ని భయపెట్టిన చైనా స్పేస్ ల్యాబ్ మండిపోయింది!
- మరో స్కైలాబ్‌గా మారిన తియాంగాంగ్-1 స్పేస్ ల్యాబ్
- ఎక్కడ కూలుతుందో తెలియక భయపడ్డ ప్రజలు
- చివరికి ఊపిరి పీల్చుకున్న చైనా
ప్రపంచాన్ని భయపెట్టిన చైనా స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-1 భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 15 నిమిషాలకు దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే మంటలు చెలరేగినట్టు చైనా అంతరిక్ష అధికారులు తెలిపారు.
దక్షిణ అట్లాంటిక్, బ్రెజిలియన్ తీర ప్రాంతంలోని సావో పాలో, రియో డీ జెనీరో ప్రాంతాల్లో ఈ స్పేస్ ల్యాబ్ కూలిపోనున్నట్టు అంతకుముందు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి చేరడానికి ముందే అది పెద్దపెద్ద ముక్కలుగా విడిపోతుందని పేర్కొన్నారు. అయితే, వారి అంచనాలు తప్పయ్యాయి.
10.4 మీటర్ల పొడవున్న తియాంగాంగ్-1ను 2011లో చైనా ప్రయోగించింది. 2013లో దీని సేవలను నిలిపివేయాలని అనుకున్నా తర్వాత దానిని పొడిగించారు. జీవితకాలం పూర్తయి, నియంత్రణ కోల్పోయిన ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2017 చివరిలోనే కూలిపోతుందని తొలుత భావించారు. అయితే, అది క్రమంగా ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ కూలిపోతుందని ప్రకటించారు. దీంతో గత రెండు రోజులుగా ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. చివరికి ఇది దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తియాంగాంగ్-1 కూలిపోతుందన్న వార్తలపై చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రపంచ మీడియాపై దుమ్మెత్తి పోసింది. స్పేస్ ల్యాబ్ కూలిపోతుందన్న వార్తలకు ప్రపంచ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించింది. చైనా స్పేస్ ఇండస్ట్రీని దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. అదో సాధారణ స్పేస్ క్రాఫ్ట్ మాత్రమేనని, అయినప్పటికీ అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో శరవేగంగా ఎదుగుతున్న చైనాపై బురదజల్లేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నించాయని ఆరోపించింది.