space x: 'స్పేస్ ఎక్స్' అంగారక యాత్రకు కొత్త డిజైన్!
- బిగ్ ఫాల్కన్ రాకెట్ డిజైన్ ను వివరించిన ఎలాన్ మస్క్
- రాకెట్ రూపకల్పనకు నిధుల సమీకరణ వివరాలు
- ద్రవ ఆక్సిజన్ ను నిల్వ చేసే ట్యాంకు ఏర్పాటే కీలకం
చౌకగా భారీ అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా ప్రయోగాలు సాగిస్తున్న 'స్పేస్ ఎక్స్' సంస్థ మనిషిని అంగారకుడిపైకి తీసుకెళ్లే ప్రయోగానికి సంబంధించిన పురోగతిని న్యూ స్పేస్ జర్నల్ లో వివరించింది. మానవులను అంగారకుడిపైకి చేరవేసే శక్తిమంతమైన రాకెట్ డిజైన్ ను స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ఆ వ్యాసంలో వివరించారు. ఈ మధ్య ప్రయోగించిన శక్తిమంతమైన రాకెట్ ఫాల్కన్ 9 డిజైన్ లో మార్పులు చేసిన ఎలాన్ మస్క్, సరికొత్త ‘బిగ్ ఫాల్కన్ రాకెట్’ (బీఎఫ్ఆర్)ను రూపొందించనున్నట్టు తెలిపారు.
ఈ రాకెట్ రూపకల్పన వివరాలు మాత్రమే కాకుండా, దీనికి అవసరమైన నిధుల సమీకరణ గురించి కూడా ఆ వ్యాసంలో ఆయన వివరించడం విశేషం. ఈ రాకెట్ లో క్రయోజెనిక్ ద్రవ ఆక్సిజన్ ను నిక్షిప్తం చేసే కార్బన్ ఫైబర్ ట్యాంకు ఏర్పాటే తమ నమూనాలో కీలకమని ఆయన తెలిపారు. అంతే కాకుండా కక్ష్యలో ఉండగానే వ్యోమనౌకకు ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా ఈ జర్నల్ లో వివరించారు. గతంలో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్లకు, బీఎఫ్ఆర్ డిజైన్ కు మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టంగా వివరించారు. కక్ష్యలో డాకింగ్ ప్రక్రియ (పార్కింగ్) దిశగా సాధించిన పురోగతిని కూడా ఆయన ఈ వ్యాసంలో వెల్లడించారు.