Telangana Jana Samithi: 'తెలంగాణ జనసమితి పార్టీ' ఆవిర్భావం.. కేసీఆర్ పై విరుచుకుపడ్డ కోదండరామ్
- పార్టీ పేరును ప్రకటించిన కోదండరామ్
- 29వ తేదీని హైదరాబాదులో పార్టీ ఆవిర్భావ సభ
- సెక్రటేరియట్ కు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ విమర్శలు
తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో పార్టీ ఏర్పాటైంది. హైదరాబాదులోని హోటల్ సెంట్రల్ కోర్టులో 'తెలంగాణ జన సమితి' పార్టీ పేరును కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ జన సమితి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ విధానాలను జేఏసీ తరపున ప్రశ్నిస్తున్న కోదండరాం... ఇక నుంచి రాజకీయ పార్టీ వేదికగా తన పోరాటాన్ని ఉద్ధృతం చేయనున్నారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, తమ పార్టీ పేరు తెలంగాణ జన సమితి అని తెలిపారు. ఈ నెల 29వ తేదీన హైదరాబాదులో భారీ ఎత్తున తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను నిర్వహిస్తామని చెప్పారు. సభ నిర్వహణ కోసం సన్నాహక కమిటీలను వేశామని తెలిపారు. 4వ తేదీన పార్టీ జెండాను ఆవిష్కరిస్తామని చెప్పారు. జెండాకు సంబంధించి పలువురి సూచనలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షలతో జరిగిందో... ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆ ఆకాంక్షలు నెరవేరడం లేదని చెప్పారు. ప్రజాస్వామిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు.
మంత్రులకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని కోదండరామ్ విమర్శించారు. ధర్మ గంట కొట్టినా సీఎం దర్శనం కలగటం లేదని అన్నారు. సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రిని తెలంగాణలోనే చూస్తున్నామని దుయ్యబట్టారు. రాజకీయాల పట్ల తమకు ద్వేషం లేదని.. సమాజానికి రాజకీయాలు గుండెలాంటివని చెప్పారు. రాజకీయాలు వ్యాపారంగా మారకూడదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక ప్రజావేదికను ఏర్పాటు చేసే క్రమంలోనే రాజకీయ పార్టీని స్థాపించామని చెప్పారు.