laxmi narayana: నా సిద్ధాంతాలు ప్రకటిస్తా.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెబుతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- నా రాజీనామా ఆమోదం పొందాల్సి ఉంది
- జనసేనలోకి ఆహ్వానిస్తానని పవన్ అన్నారు
- ఆ విషయాన్ని పేపర్లో చదివాను
- అన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తా
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని మీడియా ప్రచారం చేస్తోందని, అయితే తాను భవిష్యత్లో ఏం చేయబోతున్నాననే విషయంపై తాను ఎక్కడా చెప్పలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన రాజీనామా ఆమోదం పొందాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోందని, కానీ, ఉద్దేశపూర్వకంగా కాదని, వరుస సెలవుల వల్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన రాజీనామాపై దృష్టి సారించలేక పోతున్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి తనను స్వాగతిస్తానని చెప్పినట్లు తాను పేపర్లో చదివానని, అలాగే పవన్ జేఎఫ్సీ గురించి కూడా చదివానని లక్ష్మీ నారాయణ అన్నారు. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయని, రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నపై లక్ష్మీనారాయణ సమాధానం చెప్పలేదు. అన్ని విషయాలు, తన సిద్ధాంతాలను త్వరలోనే ప్రకటిస్తానని, అప్పటివరకు ఓపిక పట్టాలని అన్నారు.