Bharat Bandh: వృద్ధుడి ప్రాణం తీసిన భారత్ బంద్.. తండ్రిని భుజాలపై వేసుకుని కిలోమీటరు పరిగెట్టినా దక్కని ఫలితం
- రోడ్డును దిగ్బంధించిన ఆందోళనకారులు
- అంబులెన్స్‌కు దారివ్వమన్నా వినిపించుకోని వైనం
- కుమారుడి భుజాలపైనే తుది శ్వాస విడిచిన తండ్రి
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు చేపట్టిన బంద్ ఉత్తరప్రదేశ్‌లోని బజ్నోర్‌లో ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. తీవ్ర అస్వస్థతకు లోనైన 68 ఏళ్ల వృద్ధుడిని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, దళిత సంఘాలు చేపట్టిన బంద్‌లో భాగంగా రోడ్లను దిగ్బంధం చేశారు. దీంతో ఆసుపత్రికి కిలోమీటరు దూరంలో అంబులెన్స్ ఆగిపోయింది.
అంబులెన్స్‌కు దారి ఇవ్వాలంటూ ఎంత మొత్తుకున్నా ఆందోళనకారులు వినిపించుకోకపోవడంతో వృద్ధుడి కుమారుడు అతడిని భుజాలపై వేసుకుని ఆసుపత్రికి పరిగెత్తాడు. కిలోమీటరు దూరం పరిగెత్తి ఆసుపత్రికి చేరుకునే సరికే జరగరానిది జరిగిపోయింది. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్టు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు.
ఈ ఘటనపై పలువురు తీవ్రస్థాయిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా బంద్‌ను తప్పుబట్టారు. ఇది అమానవీయమని, సిగ్గు పడాల్సిన విషయమని పేర్కొన్నారు. అంబేద్కర్ కనుక బతికి ఉంటే సిగ్గుతో తలదించుకుని ఉండేవారని కామెంట్ చేశారు.
దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, రాజస్థాన్, యూపీలోని ముజఫర్‌నగర్, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.