Murder: 8 ఏళ్ల క్రితం భర్త చేతిలో హత్యకు గురైందనుకున్న మహిళ.. రెండో భర్త, ఆరుగురు పిల్లలతో కనిపించి ఆశ్చర్యపరిచిన వైనం!
- పెళ్లయిన ఏడాదికే ప్రేమికుడితో కలిసి దుబాయ్ పరారీ
- భర్త ఉద్యోగం కోల్పోవడంతో తిరిగి స్వగ్రామానికి
- మారుపేరుతో ఊళ్లో అడుగుపెట్టినా గుర్తించిన తొలి భర్త కుటుంబ సభ్యులు
ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త చేతిలో దారుణ హత్యకు గురైందనుకున్న మహిళ తాజాగా రెండో భర్త, ఆరుగురు పిల్లలతో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేసింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసిందీ విచిత్ర ఘటన.
లాహోర్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని జీలం జిల్లా ఫలాయన్ గ్రామానికి చెందిన అశ్మా బీబీ (30) కనిపించడం లేదని, భర్త ఇబ్రార్ ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ అశ్మా తల్లి 2010లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇబ్రార్ను అరెస్ట్ చేశారు. అయితే, పరిహారం ఇచ్చేందుకు ఇబ్రార్ అంగీకరించడంతో తర్వాత ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకుంది.
తాజాగా నీలం పేరుతో అశ్మా బీబీ.. రెండో భర్త, ఆరుగురు పిల్లలతో స్వగ్రామానికి చేరుకుంది. ఆమెను గుర్తుపట్టిన మొదటి భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదుపులోకి తీసుకున్నారు.
జీలం పోలీసు అధికార ప్రతినిధి కథనం ప్రకారం.. అశ్మా 2009లో ఇబ్రార్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే తన గ్రామానికే చెందిన నజీర్ అహ్మద్ అనే యువకుడితో ఆమెకు సంబంధాలున్నాయి. దీంతో 2010లో అతడి దగ్గరికి వెళ్లిపోయిన ఆమె రెండో వివాహం చేసుకుంది. దుబాయ్‌లో పనిచేస్తున్న నజీర్‌తో కలిసి ఎనిమిదేళ్లు అక్కడే ఉంది. అక్కడే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో భర్త ఉద్యోగం కోల్పోవడంతో పిల్లలతో కలిసి పాకిస్థాన్ వచ్చేసింది.
తాను, నజీర్ ప్రేమించుకున్నామని, దుబాయ్‌లో ఉద్యోగం వచ్చాక ఇద్దరం కలిసి అక్కడ స్థిరపడాలనుకున్నామని అశ్మా పోలీసులకు వివరించింది. ఈలోపు తనకు ఇష్టం లేకున్నా కుటుంబ సభ్యులు ఇబ్రార్కు ఇచ్చి పెళ్లి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. నజీర్‌తో వెళ్లిపోయినందుకు తానేమీ బాధపడడం లేదని వివరించింది. కాగా, జీలం సివిల్ కోర్టు అశ్మాకు బెయిలు మంజూరు చేసింది.