south africa: ఆసీస్ ను చిత్తు చేసిన సఫారీలు!
- 48 ఏళ్ల తరువాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గిన సౌతాఫ్రికా
- 492 పరుగుల తేడాతో భారీ విజయం
- 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికా
ప్రోటీస్ 48 ఏళ్ల నిరీక్షణకు తాజాగా తెరపడింది. సౌతాఫ్రికాలోని న్యూ వాండరర్స్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 492 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. బాల్ టాంపరింగ్ వివాదంతో అప్రదిష్ట మూటగట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు సిరీస్ ను 3-1తో ఓటమిపాలైంది. దీంతో 1969-70 తరువాత సొంతగడ్డపై ఆసీస్ పై సఫారీలు విజయం సాధించారు.
612 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్సమన్ నిప్పులు చెరిగే ఫిలాండర్ బంతులకు దాసోహమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాట్స్ మన్ లో జో బర్న్స్ (42), పీటర్ హాండ్స్ కాంబ్ (24) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. సఫారీ బౌలర్లలో ఆరు వికెట్లతో ఫిలాండర్ రాణించాడు. దీంతో ప్రోటీస్ 492 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆసీస్ పై ఇంటా బయటా సిరీస్ ను అందించిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్ గా డుప్లెసిస్ రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు విజయంతో మోర్నీ మోర్కెల్ కు సౌతాఫ్రికా ఘనంగా వీడ్కోలు పలికింది.