Telangana: తెలంగాణలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో నష్టం వాటిల్లింది : ఉద్యానవనశాఖ కమిషనర్
- పంట నష్టం అంచనాకు చర్యలు తీసుకుంటున్నాం
- అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నాం
- నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం
తెలంగాణలో భారీ వర్షాలు, వడగండ్ల వానల కారణంగా పంటలకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఉద్యానవనశాఖ కమిషనర్ కార్యాలయంలో విలేకరులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, పంట నష్టాన్ని అంచనా వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల నుంచి ఏరోజుకారోజు నివేదికలు తెప్పించి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు.
వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యపేట జిల్లాలలో వడగండ్ల వానతో పాటు, ఈదురు గాలులతో వర్షం పడిందని, సుమారు 5 కోట్ల 40 లక్షల పైచిలుకు నష్టం వాటిల్లిందని వివరించారు. మామిడి తోటలు, అరటి తోటలు, బొప్పాయి, నిమ్మతోటలకూ నష్టం జరిగిందని చెప్పారు.
పంట నష్టం జరిగిన రైతులు కూరగాయలు పండించుకోవాలని, బెండకాయలు, కాకర, టమాట, ఆకు కూరల పంటలు వేసుకోవాలని, ఆకు కూరలు పండిస్తే రెండు మాసాల్లో పంట చేతికి వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్యానశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యకార్యదర్శి పార్థసారధి చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పంటలకు బీమా సదుపాయం ఉన్నందున రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరారు.
పాలిహౌస్ లో కూరగాయల పంటలను కాగ్ ప్రశంసించిందని, నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఇన్ పుట్ సబ్సిడి ఇవ్వడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని తెలిపారు. పట్టుపరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టామని, పట్టు ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశలో ఉందని, ఒక మల్బరీ తోట ద్వారా సంవత్సరం పొడవునా ఐదుగురికి ఉపాధి లభిస్తోందని వెంకట్రామ్ రెడ్డి అన్నారు.