Telugudesam: వైసీపీ పన్నిన రాజకీయ ఉచ్చులో టీడీపీ పడింది.. అంతే!: బీజేపీ ఎంపీ హరిబాబు
- వైసీపీ డిమాండ్ చేసింది
- ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది
- వైసీపీని టీడీపీ అనుసరించింది.. అవిశ్వాస తీర్మానం పెట్టింది
- బీజేపీకి వైసీపీ దగ్గర కాలేదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని గతంలో వైసీపీ డిమాండ్ చేసిందని, ఆ డిమాండ్ ప్రకారమే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.... "మేము నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం.. మీరు పెడతారా? లేదా? అని టీడీపీ మెడ మీద వైసీపీ కత్తి పెట్టింది. వైసీపీని టీడీపీ అనుసరించింది.. అవిశ్వాస తీర్మానం పెట్టింది.
వైసీపీ పన్నిన రాజకీయ ఉచ్చులో టీడీపీ పడింది తప్పితే, వైసీపీకి బీజేపీ ఎక్కడా దగ్గర కాలేదు. టీడీపీ నాయకులు చేసే ఆరోపణల్లో యథార్థం లేదు. వైసీపీ, బీజేపీ దగ్గరవుతున్నాయన్న అపోహలు వద్దు. ప్రత్యేకించి వైసీపీ ఎంపీ పీఎంవోని వాడుకుంటున్నారని చేస్తోన్న ఆరోపణలు అసంబద్ధమైనవి. మోదీ అటువంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వరు. ఈ రోజు బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని పదే పదే చెబుతున్నారు.
మరో అడుగు ముందుకెళ్లి కేంద్ర సర్కారు మోసం చేసిందని అంటున్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సీమాంధ్రకు గత యూపీఏ ప్రభుత్వం ఒక్క జాతీయ విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా పేరును తప్ప దాని వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కేంద్రం ఇస్తోంది" అని చెప్పారు. వైసీపీకి బీజేపీ దగ్గరవుతోందన్న భ్రమ నుంచి టీడీపీ బయటకు రావాలని అన్నారు.