temples: ఏపీలోని ప్రముఖ దేవాలయాలను స్మార్ట్ టెంపుల్స్ గా తీర్చిదిద్దుతాం: కేఈ కృష్ణమూర్తి
- దేవాలయాలు ప్రాముఖ్యత సాధించడానికి కారణం భక్తులే
- భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు
- కార్యనిర్వాహక బోర్డుల నియామకం త్వరగా చేయాలి
- భక్తులకు పారదర్శకమైన సేవలు అందించాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాలను స్మార్ట్ టెంపుల్స్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కోటి రూపాయల ఆదాయం మించిన మొత్తం 59 దేవాలయాల్లో స్మార్ట్ టెంపుల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. మెదటి దశలో భాగంగా 30 దేవాలయాల్లో ప్రవేశపెట్టామని, త్వరలోనే మిగతా 29 దేవాలయాల్లో కార్యక్రమాన్ని ప్రవేశపెడతామన్నారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖ తరుఫున చేస్తోన్న కార్యక్రమాలు, వాటి పురోగతికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేవాలయాలు ఇంత ప్రాముఖ్యత సాధించడానికి కారణం భక్తులేనని, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదని కేఈ కృష్ణమూర్తి అన్నారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కార్యనిర్వాహక బోర్డులు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. స్మార్ట్ టెంపుల్స్ విధానంలో దేవాదాయ శాఖ ఏపీటీఎస్ తో కలిసి టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ సాప్ట్ వేర్ ను రూపొందించిందన్నారు. ప్రభుత్వం రూపొందించిన టెంపుల్ మేనేజ్ మెంట్ సిస్టం (TMS) ద్వారా ఎంత మంది భక్తులు దేవాలయానికి వచ్చారు? ఎంత మంది దర్శనం చేసుకున్నారు? ఎంత మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది? అలాగే స్వామివారికి అందిస్తోన్న సేవల్లో ఎంత మంది భక్తులు పాల్గొన్నారు? అనే విషయాలు రియల్ టైమ్ లో అప్ డేట్ కమీషనర్ డ్యాష్ బోర్డుకు అప్ డేట్ అవుతాయని చెప్పారు. భక్తులకు పారదర్శకమైన సేవలు అందించడం, శీఘ్ర దర్శనానికి ఆస్కారం కల్పించడం స్మార్ట్ టెంపుల్స్ విధాన లక్ష్యమన్నారు.