Chandrababu: ‘పోలవరం’ పనులు మరింత వేగవంతం: మంత్రి దేవినేని
- కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 89, 55 శాతం పనులు పూర్తయ్యాయి
- డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి
- రేడియల్ గేట్ల పనులూ వేగవంతమయ్యాయి
పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్లర్లను, ఏజెన్సీలను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబునాయుడు 55 వ వర్చువల్ ఇన్సెక్షన్ సమావేశాన్ని నిన్న నిర్వహించినట్టు చెప్పారు.
కుడి, ఎడమ కాలువలకు సంబంధించి వరుసగా 89, 55 శాతం, హెడ్ వర్క్స్ పనులు 34 శాతం పూర్తయినట్టు చెప్పారు. తవ్వకం పనులు 11 కోట్ల 15 లక్షల్లో సుమారు 7 కోట్లా 90 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయిందని, మిగిలిన 3 కోట్లా 24 లక్షల పనులు ఏ విధంగా స్పిల్ వేలోగాని, స్పిల్ చానల్ లోగాని, పైలెట్ చానల్ లోగాని పెండింగ్ పనులు వేగవంతంగా చేయడానికి నవయుగ, ట్రాన్స్ టాయ్ ఏజెన్సీలకు చంద్రబాబునాయుడు తగిన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
డయాఫ్రమ్ వాల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ఎల్ అండ్ టి, బావర్ కంపెనీలు పెద్ద ఎత్తున అనుకున్న సమయానికే మే నెలాఖరుకు ఈ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. 1,427 మీటర్లకు గానూ 1,095 మీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 331 మీటర్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు.
ఏప్రిల్ 10 వతేదీ నాటికి రెండో పంటకు గోదావరి నీరివ్వాల్సి ఉందని, ఆ తర్వాత బ్యాలెన్స్ 75 మీటర్ల నీరు వదలాల్సి ఉందని, గోదావరి ప్రవాహాన్ని మరల్చి, డయాఫ్రమ్ వాల్ పనులు వేగవంతం చేస్తారని చెప్పారు. రేడియల్ గేట్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఉక్కు సేకరణ 18 వేల టన్నులకు గానూ 10,450 టన్నులు సేకరించడం జరిగిందని దేవినేని అన్నారు.
కాంక్రీట్ పనుల విషయానికొస్తే.. 35 లక్షల 14 వేల క్యూబిక్ మీటర్ల పనుల్లో 4 లక్షల 65 వేల క్యూబిక్ మీటర్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, బ్యాలెన్స్ స్పిల్ చానల్ గాని, స్టిల్లింగ్ బేస్ గాని, స్పిల్ వే గాని సంబంధించి నవయుగ సంస్థ వేగవంతంగా పనులు చేస్తున్నట్టు చెప్పారు. గత నెలలో 91 వేల క్యూబిక్ మీటర్ల పనులను ఆ కంపెనీ చేసిందని, ఏప్రిల్ లో లక్ష క్యూబిక్ మీటర్ల పనుల లక్ష్యంగా పెట్టుకుందని, కెల్లార్ కంపెనీ ఆధ్వర్యంలో జెడ్ క్రోటింగ్ దిగువ, ఎగువ కాపర్ డ్యామ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. దిగువ కాపర్ డ్యామ్ లో 1,417 మీటర్లలో 1098 మీటర్ల పనులు పూర్తి కాగా, మిగిలిన 319 మీటర్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు చెప్పారు.