RELAINCE JIO: జియో ఇక్కడా సంచలనం సృష్టిస్తుందా...? పేమెంట్స్ బ్యాంకు సేవలు ఆరంభం
- జియో పేమెంట్స్ బ్యాంకు సేవలు
- ఇప్పటికే ఈ మార్కెట్లో ఎయిర్ టెల్, పేటీటీఎం, ఆదిత్యబిర్లా
- వేడెక్కనున్న మార్కెట్
‘ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా, లేదా?’ అన్న సినీ డైలాగ్ ను టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో నిజం చేసి చూపించింది. ఆలస్యంగా వచ్చినా అదిరే ఎంట్రీ ఇచ్చి ఏడాదిలోనే 16 కోట్ల మంది కస్టమర్లను సంపాదించి డేటా విప్లవం సృష్టించింది. గతంలో కొండపై ఉన్న డేటాను పేదవాడికీ అందుబాటులోకి తీసుకొచ్చి అగ్రగామి కంపెనీలకు అబ్బా అనిపించిన రిలయన్స్ జియో ఇప్పుడు పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చెల్లింపుల సేవల కోసం గాను పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటు చేసుకునేందుకు 11 సంస్థలకు 2015లో లైసెన్స్ లు ఇచ్చింది.
తొలుత ఎయిర్ టెల్ సంస్థ గతేడాది నవంబర్ లో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించి తొలి కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు మొదలయ్యాయి. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు సేవలు మొదలయ్యాయి. పోస్టల్ విభాగం కూడా పేమెంట్స్ బ్యాంకు సేవలను త్వరలోనే ఆరంభించనుంది. ఖాతాల్లో లక్ష వరకు డిపాజిట్ చేసుకునేందుకు ఈ సంస్థలు అనుమతిస్తాయి. బ్యాంకులతో టైఅప్ అయి పలు రకాల సేవలు అందించేందుకూ అవకాశం ఉంది.