bsnl: బీఎస్ఎన్ఎల్ సిమ్ కోసం క్యూ కడుతున్న కస్టమర్లు... మార్చిలో 40 లక్షల మంది చేరిక
- 12 లక్షల మంది పోర్ట్ ద్వారా వచ్చినవారే
- ఆకర్షించే పథకాలు, ప్లాన్ ల వల్లేనన్న బీఎస్ఎన్ఎల్
- నెట్ వర్క్ మెరుగు కోసం పెద్ద ప్రణాళికలు ఉన్నట్టు వెల్లడి
ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న పోటీని తట్టుకోలేక కస్టమర్ల ఆదరణ కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ గత వైభవాన్ని సొంతం చేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే భారీ సంఖ్యలో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారిపోతున్నారు. మార్చి నెలలో ఇలా 40 లక్షల మంది కొత్తగా చేరారు. ఇందులో 12 లక్షల మంది ఇతర నెట్ వర్క్ ల నుంచి పోర్ట్ ద్వారా అదే నంబర్ పై వచ్చిన వారు కావడం గమనించాల్సిన అంశం.
ఆకర్షణీయమైన పథకాలు, ప్లాన్ లు, ఆఫర్లు, విలువ ఆధారిత సేవలు, నెట్ వర్క్ ను బలోపేతం చేసుకోవడం వల్లే ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి బీఎస్ఎన్ఎల్ ను ఎంచుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. మెరుగైన నెట్ వర్క్ కవరేజీ, కస్టమర్ల సంతృప్తి కోసం కంపెనీ వద్ద పెద్ద ప్రణాళికలే ఉన్నాయని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు.