monsoon: ఈ ఏడాది కుమ్మేయనున్న వర్షాలు... అసాధారణ వర్షాలకు 20 శాతం అవకాశాలు: స్కైమెట్
- 100 శాతం రుతుపవనాలు సాధారణమే
- ఈ ఏడాది కరవుకు అవకాశాల్లేవని వెల్లడి
- మరో వారంలో భారత వాతావరణ విభాగం అంచనాలు
రైతులకే కాదు, ఇది భారతీయులు అందరికీ తీపి వార్తే. ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాలు సాధారణంగానే ఉంటాయని ప్రైవేటు వాతావరణ పరిశోధనా సంస్థ స్కైమెట్ తెలిపింది. రుతువుల వారీగా జూన్-సెప్టెంబర్ మధ్య 55 శాతం సాధారణ వర్షపాతానికి అవకాశాలున్నాయని, అదే సమయంలో 20 శాతం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురవచ్చంటూ అంచనాలు వెలువరించింది. కరవు వచ్చేందుకు అవకాశాల్లేవని తేల్చేసింది. ‘‘2018లో రుతుపవనాలు 100 శాతం సాధారణంగానే ఉంటాయి. ఓ 5 శాతం ప్లస్ లేదా మైనస్ కు అవకాశం ఉంటుంది’’ అని స్కైమెట్ తన తాజా నివేదికలో వివరించింది.
వర్షపాతం 96-104 దీర్ఘకాలిక సగటు (ఎల్ పీఏ) మధ్య ఉంటే దాన్ని సాధారణంగాను, 110 ఎల్ పీఏ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక వర్షపాతంగాను, 90-96 మధ్య ఉంటే సాధారణం కంటే తక్కువ అని, 90 ఎల్ పీఏ కంటే తక్కువ నమోదైతే దాన్ని లోటు వర్షపాతంగాను పరిగణిస్తుంటారు. మరో వారం రోజుల్లో భారత వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలపై బులెటిన్ విడుదల చేయనుండగా, దాని కంటే ముందుగానే స్కైమెట్ అంచనాలు వెలువడ్డాయి.