sc st act: దళితుల అంశంలో ప్రభుత్వం వైపు తప్పు జరిగిపోయింది: కేంద్ర మంత్రి పాశ్వాన్
- ప్రభుత్వం చేసింది ఆ వర్గం ప్రజలకు చేరలేదు
- చట్టాన్ని మార్చే అధికారం కోర్టుకు ఎక్కడిది?
- తన పరిధిని కోర్టు అతిక్రమించిందన్న మంత్రి
దళితుల అంశంలో కేంద్ర ప్రభుత్వం వైపు తప్పు జరిగినట్టు దళిత నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నిందితుల బెయిల్ కు సంబంధించిన నిబంధనలను సుప్రీంకోర్టు సరళీకరించిన విషయం విదితమే. దీంతో దళిత సంఘాలు భారత్ బంద్ పేరుతో ఆందోళనకు దిగడం, పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగి పోలీసుల కాల్పుల్లో 12 మంది వరకు మరణించడం తెలిసిందే. దీనిపై పాశ్వాన్ టైమ్స్ నౌ చానల్ తో మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల సమాచారం వారిని చేరుకోకముందే నిష్ఫలమైందన్నారు.
‘‘ప్రభుత్వ ఉద్దేశ్యమల్లా పౌరులకు సేవ చేయమే. ప్రభుత్వం నుంచి తప్పు జరిగినట్టు మేం ఒప్పుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్నది ఏదైనాగానీ అది ప్రజలకు చేరలేదు’’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రతిపక్షాల ఆందోళన సహేతుకమేనా? అన్న ప్రశ్నకు పాశ్వాన్ స్పందిస్తూ... ‘‘చట్టం ప్రకారం కోర్టు బెయిల్ మంజూరు చేయకూడదు. అయితే, ఈ చట్టాన్ని కోర్టు ఎలా మారుస్తుంది? సెక్షన్ 18లో మార్పులు చేయడం ద్వారా తన న్యాయ పరిధిని అతిక్రమించింది’’ అని పాశ్వాన్ అన్నారు.