Chandrababu: ఢిల్లీ ప్రెస్ మీట్ లో పోలవరంలో జరుగుతున్న పనులను లైవ్ లో చూపించిన చంద్రబాబు
- పోలవరంను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని నీతి అయోగ్, కేంద్ర ప్రభుత్వం చెప్పింది
- మేము ఖర్చు పెట్టిన రూ. 3 వేల కోట్లను వెంటనే ఇవ్వాలి
- సహాయం చేయకపోగా.. బురద చల్లే కార్యక్రమం చేపట్టారు
ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని నీతి అయోగ్, కేంద్ర ప్రభుత్వం చెప్పాయని తెలిపారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎంతో ప్రధానమైన పోలవరం పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా జరుగుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు నిధులను సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై తాము ఖర్చు చేసిన రూ. 3 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలవరంలో జరుగుతున్న పనులను లైవ్ ద్వారా ఆయన చూపించారు.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదాను ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని... కానీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పారని చంద్రబాబు అన్నారు. చేయాల్సిన సహాయాన్ని చేయకుండానే మాపై విమర్శలు కురిపించే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. నిధులకు సంబంధించిన యూసీలను సమర్పించినప్పటికీ... ఇవ్వలేదని అంటున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా, తమపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన పరపతిని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు.